జంగారెడ్డిగూడెం, జూలై 7 (7టీవీ ఫోకస్): జంగారెడ్డిగూడెం నుంచి గుంటూరుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న హైగ్రేడ్ పొగాకు బేళ్లను పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు కలపర్రు టోల్‌ప్లాజా వద్ద రెండు ఆటోలను తనిఖీ చేసి సుమారు 32 హైగ్రేడ్ పొగాకు బేళ్లను గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం నుంచి గుంటూరుకు అక్రమంగా పొగాకు తరలిస్తున్నట్లు గుర్తించి అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు ఆటోలను కలపర్రు టోల్‌ప్లాజా వద్ద నిలిపి తనిఖీ చేయగా, ఎలాంటి పర్మిట్లు లేకుండా రవాణా చేస్తున్న 32 హైగ్రేడ్ పొగాకు బేళ్లు బయటపడ్డాయి. వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పొగాకు బోర్డు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా పొగాకును రవాణా చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, బోర్డు నిబంధనల ప్రకారం వారికి తగిన బహుమతి కూడా అందజేస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు ఆక్షన్ సూపరింటెండెంట్ ఎం. గ్రేస్ మార్గరెట్ మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, పొగాకు బేళ్లను కేవలం అధికారిక వేలం కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలని సూచించారు. ఈ దాడుల్లో పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారి కిరణ్, జి.ఎం.ఎం. సాయి ప్రశాంత్, ధర్మతేజ తదితర అధికారులు పాల్గొన్నారు.

