7tv focus : ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భవిష్యత్తు అవసరాల కోసం ఆదా చేయాలని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచేలా మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది.మాగనూరు మండల కేంద్రంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ పగిలి మూడు రోజులైనా సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో విలువైన తాగునీరు వృథాగా పారుతూ చెరువును తలపిస్తోంది. పైప్లైన్ నుంచి బయటకు వస్తున్న నీరు పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున నిలిచిపోవడంతో నీటి వనరులు వృథా కావడమే కాకుండా పరిసర ప్రాంతాలు చిత్తడిగా మారుతున్నాయి.ఒకవైపు మాగనూరు కృష్ణ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల ప్రజలు మిషన్ భగీరథ ద్వారా సక్రమంగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పైప్లైన్ పగిలి నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా నీరు వృథాగా పారుతున్నా అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది.ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాల నే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా పథకం లక్ష్యం నీరుగారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

