12 రోజుల తర్వాత పోలీసులకు అప్పగించిన నిందితుడు.. అసలు ఉద్దేశంపై దర్యాప్తు
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 2: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గత నెల 20న అపహరణకు గురైన ఐదేళ్ల బాలుడు నిఖిల్ 12 రోజుల తర్వాత జీడిమెట్లలో క్షేమంగా లభ్యమయ్యాడు. బాలుడిని అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ మహబూబ్ అలీ (40) గురువారం స్వయంగా బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అప్పగించడంతో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాపూర్నగర్కు చెందిన షేక్ మహబూబ్ అలీ గత నెల 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అమ్మమ్మతో కలిసి నిద్రిస్తున్న నిఖిల్ను వెంట తీసుకెళ్లాడు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదుకావడంతో రైల్వే పోలీసులు అపహరణ కేసు నమోదు చేసి నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు బాలుడిని తన ఇంట్లోనే ఉంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీస్ స్టేషన్కు వచ్చిన అనంతరం బాలుడు తనకు దొరికాడని, జ్వరంతో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించానని, కొత్త బట్టలు కొనిచ్చానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అప్పగించానని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతని వాంగ్మూలంలో ఎంతవరకు వాస్తవం ఉందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. నిందితుడి భార్య, పిల్లలు విడిచి వెళ్లడంతో తల్లితో కలిసి నివసిస్తూ ఓ హోటల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని ఎందుకు తీసుకెళ్లాడనే అంశంపై సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు. జీడిమెట్ల పోలీసులు వెంటనే సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించి, బాలుడి తల్లితో వీడియో కాల్లో మాట్లాడించి బాలుడు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం బాలుడిని తల్లి, అమ్మమ్మకు అప్పగించి, తదుపరి దర్యాప్తు కోసం కేసుకు సంబంధించిన వివరాలను రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ, మీడియా కథనాలు, ప్రజల సహకారం దర్యాప్తుకు తోడ్పడినట్లు తెలిపారు. బాలుడి అపహరణ వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని విచారణ ద్వారా వెలికితీస్తామని చెప్పారు.

