రూ.48 కోట్ల తాగునీటి పథకం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్.. రోడ్లు దెబ్బతినకుండా ముందుగానే పైప్లైన్లు వేయాలని అధికారులకు ఆదేశం.
7టీవీ ఫోకస్, చింతలపూడి, జూలై 7: పట్టణంలో రూ.48 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న అమృత్–2.0 తాగునీటి పథకం పనులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అమృత్–2.0 పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించిన రోడ్లను తిరిగి తవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతుందని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా రోడ్ల నిర్మాణానికి ముందుగానే పైప్లైన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్, అమృత్–2.0 శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని చెప్పారు. రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు తాగునీటి పైప్లైన్ల ఏర్పాటును పూర్తి చేయాలని, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. రూ.48 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే చింతలపూడి పట్టణ రూపురేఖలు మారిపోతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు ఒకే లక్ష్యంతో పనిచేస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

