7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 20: ఆపదలో ఉన్న వ్యక్తులకు సకాలంలో మార్గనిర్దేశం, మానసిక భరోసా, అవసరమైన సహాయం అందించేందుకు రూపొందించిన ‘మార్గదర్శక్’ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 41 మంది వాలంటీర్లకు రీ-సర్టిఫికేషన్ అందజేసి, ‘మార్గదర్శక్– యువర్ బడ్డీ ఇన్ డిస్ట్రెస్ 3.0’ పేరుతో కొత్త దశకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మానసిక, సామాజిక, వ్యక్తిగత, సైబర్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారికి సహాయ సహకారాలు అందించేందుకు గత దశాబ్దంగా కొనసాగుతున్న మార్గదర్శక్ కార్యక్రమం విశేష సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో శిక్షణ పొందిన మార్గదర్శక్లు, సంగమిత్రలను ఒకే వేదిక కిందకు తీసుకువచ్చి రీ-సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సభ్యులు, ఎస్సీఎస్సీ నాయకత్వం, సైబరాబాద్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. వాలంటీర్లకు సానుభూతితో వినడం, మానసిక ప్రథమ స్పందన, మహిళల భద్రత, సైబర్ భద్రత, చట్టపరమైన అవగాహన, అవసరమైన సహాయ సేవలపై అవగాహన కల్పించారు. ఎస్సీఎస్సీ కార్యవర్గ సభ్యులు వెంకట శేషు, వనితా దట్లా, రఘు కన్నన్, నాగ్ చల్లా తదితరులు గత పదేళ్లుగా మార్గదర్శక్ కార్యక్రమం సమాజంపై చూపిన ప్రభావాన్ని వివరించారు. కమ్యూనిటీల్లో విశ్వసనీయ సహాయకులుగా సేవలందిస్తున్న వాలంటీర్ల కృషిని అభినందించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ మహిళా, శిశు భద్రత విభాగం డీసీపీ కె. సృజన మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసుల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని తగిన సహాయ వ్యవస్థలతో అనుసంధానించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి తొలి ఆశ్రయంగా మార్గదర్శక్లు నిలుస్తారని చెప్పారు. అవసరమైన సమయంలో భరోసా, మార్గనిర్దేశం అందిస్తూ సమాజంలో సహకార సంస్కృతిని మరింత బలోపేతం చేయాలని వాలంటీర్లకు సూచించారు. ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్ ఆలమ్ ఖాన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రష్మీ శ్రీవాస్తవ మార్గనిర్దేశం చేశారు. మహిళా భద్రతా ఫోరం నాయకురాలు ప్రత్యూష శర్మతో పాటు విష్ణుప్రియ సక్సేనా, పద్మప్రియ చలమకూరి, షాలిని సింగిరెడ్డి, సోనియా సహగల్ తదితర వాలంటీర్లు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. మొత్తం 41 మంది వాలంటీర్లు రీ-సర్టిఫికేషన్ పొందగా, సమాజంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే తమ బాధ్యతను మరోసారి పునరుద్ఘాటించారు. ‘మార్గదర్శక్– యువర్ బడ్డీ ఇన్ డిస్ట్రెస్ 3.0’ ద్వారా మరింత విస్తృత స్థాయిలో సేవలు అందించేందుకు సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ కట్టుబడి ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

