ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి
షాద్నగర్, జూలై 8 (7టీవీ ఫోకస్): జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సవరణలు పేదలు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికుల ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా మారతాయని హెచ్చరించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)ను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి డిమాండ్ చేశారు. అంత్యోదయ అన్న యోజన (ఏఏవై)లో ప్రస్తుతం అమలులో ఉన్న కుటుంబ ప్రాతిపదిక అర్హత విధానాన్ని తొలగించి, వ్యక్తి ప్రాతిపదిక విధానాన్ని తీసుకురావడం తీవ్ర అన్యాయమని ఆయన అన్నారు. ఒక్కో వ్యక్తికి 7 కిలోల బియ్యం ఇస్తామని పేర్కొంటున్నప్పటికీ, చిన్న కుటుంబాలు ప్రస్తుతం పొందుతున్న 35 కిలోల పూర్తి ప్రయోజనాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, పెద్ద కుటుంబాలకు కూడా అదనపు ప్రయోజనం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వంటి బలహీన వర్గాలు అంత్యోదయ పథకంపై ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రతిపాదిత మార్పులు వారి ఆహార భద్రతను దెబ్బతీస్తాయని తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొనసాగుతున్న ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారుల జాబితాను ప్రస్తుత జనాభాకు అనుగుణంగా విస్తరించాల్సిన అవసరం ఉందని, అర్హులైన కొత్త పేద కుటుంబాలను చేర్చకుండా వారి హక్కులను తగ్గించడం సమంజసం కాదని విమర్శించారు. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ మార్పులు మరింత నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రజల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా అమల్లోకి వచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను ఎన్పీఆర్డీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని భుజంగారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దివ్యాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, వాటి ప్రయోజనాలను తగ్గించడం వారి జీవన భద్రతను దెబ్బతీయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రతిపాదిత సవరణలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు, పేద ప్రజలను సమీకరించి ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

