7tv focus : భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. విమానంలోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. ఎయిరిండియా సంస్థకు చెందిన ఏఐ-1886 అనే విమానం మధ్యప్రదేశ్, భోపాల్ నుంచి ఆదివారం ఉదయం ఢిల్లీకి బయల్దేరింది.ఉదయం 8.25 గంటలకు భోపాల్ నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే, కాస్త ఆలస్యంగా 8.47 గంటలకు బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం ఉదయం 9.55 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవ్వాలి. కానీ, విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రాజస్థాన్‌లోని జైపూర్‌కు మళ్లించాల్సి వచ్చింది. చివరకు 9.40 గంటల సమయంలో జైపూర్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని విమానయాన సంస్థ వెల్లడించింది. అయితే, విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య ఏంటి అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

