7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొని బీఎల్వోలు అందజేసే ఎన్యుమరేషన్ ఫారంలో తమ పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. బీఎల్వోలు ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల నమోదైన ఓట్లను గుర్తించి తొలగించడంతో పాటు నకిలీ ఓట్ల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం జూలై 24 వరకు కొనసాగనున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత అవసరమని పేర్కొంటూ, స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీహెచ్ బుచ్చిరెడ్డి, సంతోష్ గుప్తా, యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్, సతీష్, మధుకర్, నరేష్, మారుతి, అశోక్, రవి గుప్తా, రామిరెడ్డి, దేవదాస్, ఉప్పల సంతోష్, రాజు, ఆనంద్, ఉప్పల రాములు, లక్ష్మి, రజిత, రాధిక, స్థానిక కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.

