మరిపెడ, జూలై 6 (7 టీవీ ఫోకస్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల భర్తీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కాంగ్రెస్ నాయకులు సహాయం అందిస్తున్నారు. ఫారాలను సక్రమంగా నింపించి సంబంధిత అధికారులకు సమర్పించేలా అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఫారాలను ఎలా నింపాలో తెలియక పలువురు ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరిపెడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తాజుద్దీన్, 4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము, బీఎల్ఏ బయ్య లింగయ్య, అనంతగిరి రవి, మైనార్టీ నాయకుడు యాకూబ్ పాషా ఆధ్వర్యంలో ప్రజలకు ఎస్ఐఆర్ దరఖాస్తుల భర్తీలో సహాయం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎలాంటి తప్పులు, కొట్టివేతలు లేకుండా ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్వోలకు గడువులోపు సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటరు వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని కోరారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని నాయకులు తెలిపారు.

