శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డి
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 23: ఓటరు జాబితాల పరిశీలనలో బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్తో కలిసి నడిచిన కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన నాయకులు పార్టీలు మారినా, పార్టీని నిలబెట్టేది కార్యకర్తలేనని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతులు, రహదారులు, ఫ్లైఓవర్లు, శాంతిభద్రతల పరిరక్షణలో విశేష పురోగతి సాధించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. మహిళలకు ఆర్థిక సాయం, యువతకు ఉద్యోగాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి గతంలో ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులు నెమ్మదించాయని, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాల్లో ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని, అభివృద్ధి పనుల కంటే ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ బూత్‌పై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. మరణించిన వారి పేర్లు, చిరునామాలు మారిన వారి వివరాలు సక్రమంగా నమోదు కావాలని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని అన్నారు. ప్రతి బూత్‌ను పార్టీ బలోపేతానికి కేంద్రంగా మార్చాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, ముందుగా అసలైన ఓట్లను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించాలని సూచించారు. డూప్లికేట్ ఓట్లు, అనర్హుల పేర్లు ఉంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్‌పై ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శాంబీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

