7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: కుత్బుల్లాపూర్ గ్రామం విమానపురి కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 286వ వార్డు పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం, విమానపురి కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు కాలనీలో కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైప్లైన్ ప్రస్తుతం పెరిగిన జనాభాకు సరిపోవడం లేదని, దానిని విస్తరించి పునర్నిర్మించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కేపీ వివేకానంద్ సంబంధిత అధికారులను సమస్యను అత్యవసరంగా పరిశీలించి, తక్షణ చర్యలు చేపట్టి పరిష్కరించాలని ఆదేశించారు. కాలనీ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జిట్టా బల్వంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు రావి హనుమంత్ రావు, పార్థన్ పిళ్లై, కార్యదర్శి అజీష్ నాయర్, సంయుక్త కార్యదర్శి కృష్ణ, అశ్లే, శంకర్ రావు, కోశాధికారి అరుణ్ కుమార్, రామారావు, సాయి గుప్త, మహేష్ గౌడ్, హేమంత్ రెడ్డితో పాటు కాలనీ ప్రముఖులు, సంక్షేమ సంఘం సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

