నారాయణపేట జిల్లా మక్తల్ నర్వ మండలానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. మండలంలోని కల్వాల గ్రామానికి చెందిన అక్కాతమ్ముళ్లు తమ అద్భుత సంగీత ప్రతిభతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి సరికొత్త చరిత్ర సృష్టించారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ సంగీత సంస్థ ‘హల్లెల్ మ్యూజిక్ స్కూల్’ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కీబోర్డ్ సంగీత ప్రదర్శనలో వీరు భాగస్వాములయ్యారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ భారీ ప్రదర్శనలో ఏకధాటిగా గంటపాటు ఎక్కడా ఆగకుండా, అద్భుతమైన స్వరాలు పలికించి ఈ రికార్డును సాధించారు. ముఖ్యంగా మూడు సరళీ స్వరాలను కేవలం 45 సెకన్లలోనే ప్లే చేసి నిర్వాహకులను సైతం ఆశ్చర్యపరిచారు.
ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుండి సుమారు 2,000 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొన్న ఈ బృహత్తర కార్యక్రమంలో, అత్యంత ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులు మాత్రమే గిన్నీస్ రికార్డుకు ఎంపికయ్యారు. అందులో నర్వ మండలం, కల్వాల గ్రామానికి చెందిన ఇస్రంపల్లి జక్కయ్య, సృజన దంపతుల సంతానమైన ఇస్రంపల్లి షారోన్ (10వ తరగతి), ఇస్రంపల్లి చార్లేస్ ఫిన్నీ (9వ తరగతి) తమ అసాధారణ ప్రతిభతో ఈ జాబితాలో స్థానం దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్ లో గల ఎంఎన్ఆర్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ అద్భుత విజయానికి గుర్తుగా మే 29 న హైదరాబాద్, గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ప్రతిష్టాత్మకంగా గిన్నీస్ ‘అచీవర్స్ మీట్’ ను నిర్వహించింది.
ఈ వేడుకలో హాల్లేల్ మ్యూజిక్ స్కూలు వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి స్వయంగా పాల్గొని, గిన్నీస్ రికార్డు సాధించిన ఈ అక్కాతమ్ముళ్లకు సర్టిఫికేట్లు అందజేసి ప్రత్యేకంగా అభినందించినట్లు ఆదివారం విజేతల తల్లితండ్రులు తెలిపారు. గ్రామీణ ప్రాంత మూలాలు ఉండి, అంతర్జాతీయ వేదికపై నర్వ మండలం పేరును మారుమోగించిన షారోన్, చార్లేస్ ఫిన్నీలపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. వీరి అరుదైన ఘనత పట్ల పలువురు ప్రముఖులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.