‘ఆడబిడ్డలతో నా పుట్టినరోజును జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదమే నా బలం. నాకు ఏ కోరికలు లేవు. గొప్ప పదవుల కోసం ఆశించట్లేదు. నా జీవిత లక్ష్యం ఒక్కటే.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం. అందుకు నా సర్వశక్తులు ధారపోస్తాను’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందాలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.‘ఆడబిడ్డల్ని ఉన్నత చదువులు చదివించండి. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడొద్దు. మీ ఆడబిడ్డల్ని ఉన్నత చదువులు చదివిస్తామని నా పుట్టిన రోజున నాకు మాట ఇవ్వండి. ఆడబిడ్డల చేతిలో పెత్తనం ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆడబిడ్డలు నేడు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ భాగస్వాములుగా ఉన్నారు. మహిళా సంఘాలకు రూ.79వేల కోట్ల రుణాలిచ్చాం. మహిళా రుణాలకు రూ.1,900 కోట్ల వడ్డీ చెల్లించాం. ఇంటి పట్టా మహిళలకే ఇచ్చాం. మహాలక్ష్మి పథకానికి ఇప్పటిదాకా రూ.13వేల కోట్లు ఇచ్చాం. ఆటోవాళ్లతో కలిసి నాపై యుద్ధానికి వచ్చారు కానీ.. ఈ పథకం ద్వారా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టింది. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదు.

