7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 6: బహదూర్‌పల్లిలో జాబ్ మేళా ప్రారంభం – 30 కంపెనీల పాల్గొనిక – ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాల అందజేత బొట్టు బొట్టు నీరు కలిసి నదిగా మారినట్లే, చిన్న ఉద్యోగంతో కెరీర్‌ను ప్రారంభించిన యువత క్రమంగా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో ఉన్న కేఎం. పాండు మెమోరియల్ వోకేషనల్ జూనియర్ కళాశాల వేదికగా ఇంటర్మీడియట్ వోకేషనల్ బోర్డు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేఎం. పాండు మెమోరియల్ వోకేషనల్ జూనియర్ కళాశాల చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రతి ఏడాది వందలాది మంది విద్యార్థులకు విద్య అందించడమే కాకుండా జాబ్ మేళాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ వోకేషనల్ విద్యాభివృద్ధికి సహకరిస్తున్న జేఈటీఎల్, ఏవీ రావు పవనపుత్ర ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు ఈ కార్యక్రమానికి తోడ్పాటునందించిన సంస్థలు, దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఉద్యోగాలకు ఎంపికైన యువత మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

జాబ్ మేళాలో దాదాపు 30 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. అర్హత సాధించిన అభ్యర్థులను వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అనంతరం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలు పొందిన నలుగురు విద్యార్థులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ కుషాన్, ఇంటర్మీడియట్ వోకేషనల్ ఎడ్యుకేషన్ విభాగం జాయింట్ సెక్రటరీ జోష్నా, ఆర్డీఎస్ఐఈ ఏడీ ఉషేంద్ర, కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర, మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఉమా, కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్య, దాతలు బి. సాయికుమార్, ఏవీ రావు, వెలుగు ట్రస్ట్ వ్యవస్థాపకుడు నారాయణరావు, మాజీ కౌన్సిలర్లు ఎలుగారి సత్యనారాయణ, భరత్, మాజీ సర్పంచ్ కొమురయ్య యాదవ్, సగ్గడి పద్మారావు, నాయకులు సగ్గడి శ్రీనివాస్, నాయి కోటి శ్యామ్, అధ్యాపకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

