చిన్న పెట్టుబడులతో నమ్మించి.. లక్షలు కాజేస్తున్న సైబర్ మోసగాళ్లు

7టీవీ ఫోకస్, హైదరాబాద్, ప్రతినిధి జూన్ 15:రోజుకు వేల రూపాయల ఆదాయం, కొద్ది రోజుల్లో డబ్బు రెట్టింపు, టాస్క్‌లు పూర్తి చేస్తే భారీ కమిషన్, ట్రేడింగ్ ద్వారా ఖచ్చితమైన లాభాలు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి. సాయి మనోహర్ హెచ్చరించారు. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూపులు, నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్ములు, ఫేక్ వెబ్సైట్ల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు కాజేస్తున్నట్లు తెలిపారు.
సైబర్ నేరగాళ్లు ముందుగా సోషల్ మీడియా లేదా టెలిగ్రామ్ ద్వారా బాధితులను సంప్రదించి ప్రత్యేక గ్రూపుల్లో చేర్చుకుంటారు. ఆ గ్రూపుల్లో అంతర్జాతీయ కంపెనీలు, ప్రముఖ హోటళ్లు, రిసార్టులు లేదా పేరొందిన బ్రాండ్ల ప్రతినిధులమని చెప్పి నమ్మకం కల్పిస్తారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ఆన్లైన్ టాస్క్‌లు, ప్రొడక్ట్ ప్రమోషన్, ఆర్డర్ బుకింగ్, ట్రేడింగ్ కార్యకలాపాల పేరుతో మొదట చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టించి, కొంత లాభం వచ్చినట్లు చూపిస్తూ బాధితుల్లో విశ్వాసం పెంచుతారు. తర్వాత మరింత అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెడతారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్లు లేదా ట్రేడింగ్ ప్లాట్‌ఫార్ముల్లో నమోదు చేయించి, పెట్టుబడులు పెరిగే కొద్దీ ఖాతాల్లో భారీ లాభాలు వచ్చినట్లు చూపిస్తారు. దీంతో బాధితులు మరింత డబ్బు పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వస్తారు. అయితే డబ్బును ఉపసంహరించుకునే సమయంలో అసలు మోసం బయటపడుతుంది. అకౌంట్ వెరిఫికేషన్ ఫీజు, ట్యాక్స్ క్లియరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్, వీఐపీ అప్‌గ్రేడ్, విత్‌డ్రా అన్‌లాక్ ఛార్జీలు వంటి పేర్లతో మరిన్ని చెల్లింపులు చేయాలని నేరగాళ్లు డిమాండ్ చేస్తారు. ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బు పెట్టిన బాధితులు తమ పెట్టుబడి తిరిగి వస్తుందనే ఆశతో మళ్లీ మళ్లీ చెల్లింపులు చేస్తుంటారు. అయినప్పటికీ డబ్బు ఉపసంహరణకు అవకాశం ఇవ్వకుండా చివరికి బాధితులను బ్లాక్ చేయడం లేదా మరిన్ని డబ్బులు కోరడం జరుగుతోందని డీసీపీ వివరించారు. ప్రజలు ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, టెలిగ్రామ్ లేదా సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే అధిక లాభాల హామీలను నమ్మవద్దని సూచించారు. ముందుగా డబ్బు చెల్లించాలని చెప్పే ఉద్యోగ అవకాశాలు, తెలియని వ్యక్తులు పంపిన ట్రేడింగ్ వెబ్సైట్లు, యాప్‌లు, లింకుల పట్ల జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే పథకాలకు దూరంగా ఉండాలని, డబ్బు ఉపసంహరణ కోసం అదనపు చెల్లింపులు కోరితే వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ ఫిర్యాదు పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి. సాయి మనోహర్ విజ్ఞప్తి చేశారు.

