గచ్చిబౌలి, జూలై 8 (7 టీవీ ఫోకస్): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు సమగ్ర సర్వేలు నిర్వహించి డేటా ఆధారిత కార్యాచరణ రూపొందించాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. వాహనాల రాకపోకలు, రద్దీ సమయాలు, రహదారుల సామర్థ్యంపై అధ్యయనం చేపట్టాలని సూచించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో శేరిలింగంపల్లి ట్రాఫిక్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులతో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు డేటా ఆధారిత సర్వేలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ప్రధాన కార్యాలయాల నుంచి ఏయే సమయాల్లో ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయనే అంశాలపై వారం రోజుల పాటు సమయాల వారీగా వాహనాల లెక్కింపు చేపట్టాలని ఆదేశించారు. దీనివల్ల ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ తీవ్రతపై స్పష్టమైన అవగాహన లభిస్తుందని తెలిపారు. ఐటీ కారిడార్‌లో కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, వాహనాల వర్గీకరణ, ట్రాఫిక్ వాల్యూం, రహదారుల సామర్థ్యంపై సమగ్ర విశ్లేషణ నిర్వహించాలని సూచించారు.

ప్రధాన జంక్షన్లు, రహదారుల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును సమీక్షించి, అవసరమైన చోట హై-రిజల్యూషన్ కెమెరాలు, జియో-ట్యాగింగ్, పెలికాన్ సిగ్నల్స్ వంటి సదుపాయాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, హోటళ్లు, విద్యాసంస్థల వద్ద ట్రాఫిక్ పరిస్థితులను అధ్యయనం చేసి రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ను సాఫీగా నడిపేందుకు తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యాసంస్థల ప్రారంభ, ముగింపు వేళల్లో విద్యార్థుల ప్రయాణ విధానాన్ని కూడా విశ్లేషించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండకూడదని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ సీపీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి ట్రాఫిక్ డీసీపీ రవికుమార్, అడిషనల్ డీసీపీ హనుమంతరావు, ట్రాఫిక్ అడ్మిన్ అడిషనల్ డీసీపీ నరేందర్, ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

