7tv focus : తెలుగు రాష్ట్రాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని, రుణాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా భారీస్థాయిలో కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. బాధితుల ఫిర్యాదుతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీలో కాల్ సెంటర్ ను గుర్తించడమే కాకుండా, అందులో పనిచేస్తున్న 21 మంది తెలుగు యువతులను అరెస్ట్ చేశారని కథనాలు వస్తున్నాయి. ఈ ముఠా గత 18 నెలలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రుణాలు ఇప్పిస్తామని ఆశపెట్టి ఫోన్ ద్వారా అమాయకుల నుంచి డబ్బు కొల్లగొడుతున్న ముఠాలో అసలు సూత్రధారులు ఇంకా దొరకాల్సివుందని పోలీసులు చెబుతున్నారు. Also Read – రెండేళ్లలో 300 ఫ్యామిలీల మేజిక్.. ఆ నాలుగు ధనిక దేశాలను దాటేసింది! ఢిల్లీ కేంద్రంగా సైబర్ ముఠా అరాచకాలకు పాల్పడుతోందని గుర్తించిన పోలీసులు ఆకస్మిక దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారని చెబుతున్నారు. కాల్ సెంటర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఫోన్ కాల్స్ చేసేవారని, తాము ప్రముఖ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులమని నమ్మబలికి, అతి తక్కువ వడ్డీతోపాటు ఎటువంటి గ్యారెంటీలు లేకుండానే రుణాలు ఇస్తామని ఆశ చూపే వారని పోలీసులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో సులభంగా మమేకం అవ్వడానికి ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే యువతులను టెలీకాలర్లుగా నియమించుకోవడం ద్వారా ఈ ముఠా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని అంటున్నారు.

