7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 26: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. పార్టీ సంస్థాగత బలోపేతమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పర్యటన వివరాలను వెల్లడించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, ట్రెజరర్ దేవకి వాసుదేవరావు, రాష్ట్ర మీడియా ఇన్చార్జి ఎన్.వి. సుభాష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జూన్ 28న శంషాబాద్ చేరుకునే నితిన్ నవీన్ రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్మించిన పార్టీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జీహెచ్ఎంసీ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని, అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారని చెప్పారు. రెండో రోజు విబిఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న అనంతరం భువనగిరి మీదుగా వరంగల్‌కు వెళ్లి గిరిజన ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షుల సమావేశంలోనూ పాల్గొంటారని చెప్పారు. మూడో రోజు ఘట్కేసర్లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని వివరించారు. ఈ పర్యటన పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతానికి సంబంధించినదేనని, ఎన్నికలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తుంగభద్ర జలాల అంశంపై మాట్లాడుతూ, రిపేర్ పనులను స్వాగతిస్తున్నామని, అయితే తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్ఆర్సీ, సీఏఏ అంశాలపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.

