తెలంగాణ 7tv focus : తెలంగాణలోని దాదాపు 2.49 కోట్ల ఎకరాల భూమిని తమ సొంత ఆస్తిగా భావించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ధరణి పోర్టల్ నిర్వహణను దివాలా తీసిన ఒక విదేశీ కంపెనీకి అప్పగించారని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ పై ఉన్న నియంత్రణను దుర్వినియోగం చేస్తూ అర్ధరాత్రి సమయాల్లో రిజిస్ట్రేషన్లు చేశారని కీలక ఆరోపణలు చేశారు. ప్రజల ఆస్తులను పరిరక్షించడమే రెవెన్యూ సంస్కరణల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. శాసనసభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ఆశామాషీగా తీసుకురాలేదని.. దాదాపు 18 రాష్ట్రాల్లోని అధికారులు అధ్యయనం చేశాక..ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే భూ భారతికి రూపకల్పన చేశామని స్పష్టం చేశారు. భూభారతి ఎన్ ఐసి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే పారదర్శకంగా నడుస్తుందని తెలిపారు. అలాగే 22ఏ నిషేధిత భూముల అంశంపై మాట్లాడుతూ.. 2023 నాటికి 22 ఏ జాబితాలో కోటి 2 లక్షల 52 వేల 690 ఎకరాలకు సంబంధించిన వివరాలను సభ ముందు ఉంచారు మంత్రి పొంగులేటి. వీటిలో అటవీ, అసైన్డ్, ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

