7tv focus : ధాన్యం విక్రయించుకునేందుకు పొలానికి వెళ్తున్న రైతును గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. హవేలి ఘనపూర్ మండలం ఔరంగాబాద్‌కు చెందిన తిరుపతి కిషన్ (65) ఈ ప్రమాదంలో మృతిచెందారు. గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల ద్వారా ధాన్యం అమ్ముకునేందుకు సిద్ధమైన ఆయన.. చివరకు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు.తిరుపతి కిషన్ తన పొలంలో వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధం చేసుకున్నారు. అయితే గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు, దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నవంబర్ 3న రాత్రి 10.45 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఔరంగాబాద్ గేట్ వద్ద పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన కిషన్‌ను స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు.ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన డ్యూటీ వైద్యుడు అందుబాటులో లేరని, కనీస విద్యుత్ సదుపాయం కూడా లేక వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురయ్యాయని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందుబాటులో ఉండి ఉంటే ఆయన ప్రాణాలు దక్కేవేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు కిషన్ మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

