7tv focus : నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం (నవంబర్ 16) తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు భవనం మూడో అంతస్తులోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న 20 మందికి పైగా విద్యార్థినులకు చెందిన వ్యక్తిగత వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదని సమాచారం.నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల యాజమాన్యం విద్యార్థినుల వసతి కోసం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుంది. అందులో మూడో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థినులు ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఓ గదిలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు మంటలు కొనసాగినట్లు విద్యార్థినులు తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అద్దె భవనంలో అగ్నిమాపక యంత్రాలు (ఫైర్ ఎక్స్టింగ్విషర్లు), ఇతర ప్రాథమిక అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని విద్యార్థినులు ఆరోపించారు. భవనంలో సరైన గాలి ప్రసరణ లేకపోవడంతో కొందరు విద్యార్థినులు పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా వాటర్ హీటర్లో ఏర్పడిన లోపం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో విద్యార్థినుల దుస్తులు, పుస్తకాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు కాలిపోయాయి. కాగా, కళాశాలలో శాశ్వత హాస్టల్ భవన నిర్మాణానికి 2024లోనే శంకుస్థాపన చేసినప్పటికీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. నర్సింగ్ కళాశాల భవనం పూర్తయినప్పటికీ తమకు ఆ తరహా హాస్టల్ వసతులు ఎప్పుడు కల్పిస్తారో తెలియడం లేదని ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.

