7tv focus : ఎల్‌నినో ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని నల్లగొండ రూరల్ మండల ప్రత్యేక అధికారి, పశు సంవర్ధక శాఖ జేడి డాక్టర్ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండ మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మండల స్థాయి అధికారులు విధిగా పర్యటించి ప్రజలకు మెరుగైన వసతులు అందుతున్నాయో లేదో చూడాలన్నారు.ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. ప్రస్తుతం కెనాల్ ద్వారా విడుదలవుతున్న నీటితో అన్ని గ్రామాల్లోని చెరువులను నింపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని గ్రామాల్లో తమ గ్రామాలకు నీరు అందకుండా కిందికి వెళ్లే కాలువలకు గండ్లు కొడుతున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామాల్లో పట్టపగలే వీధి విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయని, విద్యుత్ వృథాను అరికట్టేందుకు లైట్లకు ఆన్-ఆఫ్ స్విచ్‌ల ఏర్పాటు చేయాలని సూచించారు. నీటితో పాటు విద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించేలా గ్రామస్థాయిలో చర్యలు చేపట్టాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

