7tv focus : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆందోళనకర వాతావరణం కొనసాగుతోంది. సీజేపీ, ఎస్ఎఫ్ఐ సహా పలు సంఘాల నేతలు ఈసీకి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవ్వగా.. వారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులతోపాటు పలువురు జర్నలిస్టుల్ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో అనేక మంది మహిళలు కూడా ఉన్నారు.ప్రముఖ జాతీయ దినపత్రికలకు చెందిన జర్నలిస్టులు, డిజిటల్ జర్నలిస్టులు, కెమెరా పర్సన్స్ సహా మీడియాలో పని చేసే అనేక మందిని రైజైనా రోడ్లోని ప్రెస్ క్లబ్ బయట పోలీసులు అరెస్టు చేశారు. ప్రెస్ క్లబ్ బయట దాదాపు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారుల్ని కన్నాట్ ప్లేస్ నుంచి బస్సులో తరలిస్తుండగా.. వారిలో ఇద్దరు జర్నలిస్టులు, ఇద్దరు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కొందరికి రక్తస్రావం కూడా జరిగింది.రెండు బస్సుల్లో వంద మంది ఆందోళనకారుల్ని అరెస్టు చేసి, తరలించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే అంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. వీరిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పలువురు నిరసనకారులపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆందోళనకారుల్ని అత్యవసరమైతే తప్ప అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరోవైపు సీఈసీ రాజీనామా చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది.

