గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం బలమైన వినతి సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
తుగ్గలి, జూలై 31 ( 7 టీవీ ఫోకస్ న్యూస్ ):
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలంటే సెంట్రల్ ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల అత్యవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు పి. వెంకటపతి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పత్తికొండ నియోజకవర్గానికి వెంటనే సెంట్రల్ ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తూ, గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పి. వెంకటపతి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలంటే అత్యాధునిక వసతులతో కూడిన ఏకలవ్య పాఠశాల ఏర్పాటు అత్యవసరమని పేర్కొన్నారు. పత్తికొండ ప్రాంతంలోని గిరిజన కుటుంబాల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష నెరవేరేలా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.గిరిజనుల విద్యా హక్కుల కోసం నిరంతరం ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తూ కృషి చేస్తున్న రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు పి. వెంకటపతి ప్రయత్నాలను స్థానిక గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఇప్పుడు ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా, పత్తికొండకు సెంట్రల్ ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేసి గిరిజన విద్యార్థుల ఆశలను నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు.

