7 టివి ఫోకస్, జీలుగుమిల్లి, జూలై 2: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీలోని ఎంపీపీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల సౌకర్యాలు, భవనం పరిస్థితిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీలోని ఎంపీపీ పాఠశాలను గురువారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువులు, హాజరు, మధ్యాహ్న భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పాఠశాల భవనం పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే, భవనం భద్రత, మరమ్మతుల అవసరంపై సంబంధిత అధికారులతో చర్చించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. అనంతరం చంద్రమ్మ కాలనీలో ప్రతిపాదిత అంగన్వాడీ కేంద్రం నూతన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న పాత భవనం పరిస్థితిని గమనించి, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా నూతన భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, శిశు సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు సూచించే ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూరం వెంకటేశ్వరరావు, మొడియం వెంకటకృష్ణ, బండారు అనిల్, రూపా సత్యనారాయణ, శేఖముడి సాయి, చిర్రి వెంకటేశ్వరరావు, కొండపల్లి ప్రసాద్, కక్కిరాల మురళి, మధు, సిరిబత్తుల స్వామి, సూరిశెట్టి మహేష్, గద్దె సుబ్రహ్మణ్యం, ఉండవల్లి కిరణ్, గారపాటి శ్రీను, నేలటూరి మోహన్, గణేష్, ఎంఈవో శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

