పీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్ దరఖాస్తులను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాల
7టీవీ ఫోకస్, ఏలూరు, జూలై 6: ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో అందిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్‌కుమార్ రెడ్డి, ఇన్చార్జి డీఆర్వో ఎల్. దేవకీదేవి, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు అర్జీలను కేవలం పరిష్కరించినట్లు నమోదు చేయకుండా, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణీత గడువులోగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒకే సమస్యపై మళ్లీ మళ్లీ అర్జీలు వచ్చే పరిస్థితి లేకుండా శాశ్వత పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అందిన ప్రధాన అర్జీల్లో, టి. నరసాపురం మండలం మక్కినవారిగూడెంకు చెందిన సిరిమళ్ల వెంకటేశ్వరరావు స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.1.44 కోట్లకు పైగా ఎరువుల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ చేపట్టాలని కోరారు. ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి చెందిన చల్లగుళ్ల నరేష్కుమార్ పంట బోదెను పూడ్చివేశారని, దానిని పునరుద్ధరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ సుభానీ తమ ఇళ్లకు వెళ్లే రహదారిని ఆక్రమించారని, విచారణ చేసి యథాతథ స్థితికి తీసుకురావాలని కోరారు. జీలుగుమిల్లి మండలం పూచికపాడు గ్రామానికి చెందిన బెల్లంకొండ సుభాషిణి నివాస ప్రాంతంలో మేకల పెంపకం వల్ల దుర్వాసన, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని అర్జీ సమర్పించారు. మండవల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన మారగాని సాంబశివరావు తమ ప్రాంతంలో డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

