7టీవీ ఫోకస్, కరీంనగర్, జూన్ 27: బాలలు తమ హక్కులను తెలుసుకొని అవసరమైన సందర్భాల్లో ఉచిత న్యాయసేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ప్రతినిధులు సూచించారు. ‘చిల్డ్రన్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్–2024’పై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ నగరంలోని మంకమ్మతోట ధంగర్వాడి హైస్కూల్లో చిల్డ్రన్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్–2024’పై చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు విద్యార్థులకు బాలల హక్కులు, ఉచిత న్యాయసేవలు పొందే విధానం, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించారు. పిల్లల హక్కుల పరిరక్షణకు కేంద్రంగా రూపొందించిన ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు, అమలు విధానం, అందుబాటులో ఉన్న న్యాయ సహాయంపై వివరించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు జిల్లా న్యాయసేవ అధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయసహాయం పొందవచ్చని తెలిపారు. చిన్నారుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, తమ హక్కుల పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం కల్పించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు అడ్వకేట్ చంద్రప్రకాష్ రెడ్డి, రంగయ్య, కిరణ్ కుమార్, అశ్విని, శాంతికుమార్ పాల్గొని విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. పారా లీగల్ వాలంటీర్లు సి. సంజయ్ కుమార్, షమీమ్, సుజాత, స్వప్న కూడా చట్టపరమైన అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. సదస్సులో పాల్గొన్న వందలాది మంది విద్యార్థులు తమ హక్కులు, చట్టపరమైన రక్షణ, ఉచిత న్యాయసేవలు పొందే విధానంపై అవగాహన పెంపొందించుకుని, ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

