
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ పోలీస్ శాఖలో పండుగ వాతావరణం నెలకొంది. విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ, అంకితభావాన్ని కనబరిచిన పోలీస్ అధికారులను ప్రభుత్వం సేవా పతకాలతో గౌరవించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో మొత్తం 631 మంది సిబ్బందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా బాలానగర్ ఇన్స్పెక్టర్ టి. నర్సింహా రాజును ప్రతిష్టాత్మక ‘తెలంగాణ పోలీస్ సేవా పతకం’ వరించింది.
వివిధ విభాగాల్లో కనబరిచిన ధైర్యసాహసాలు, నిబద్ధతకు గుర్తింపుగా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులను ప్రభుత్వం ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో బాలానగర్ డివిజన్ ఇన్స్పెక్టర్ టి. నర్సింహా రాజు తన విశిష్ట సేవలకు గానూ ‘తెలంగాణ పోలీస్ సేవా పతకానికి’ ఎంపికై ప్రత్యేక గుర్తింపు సాధించారు.
ఈ సందర్బంగా సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చే ఈ గుర్తింపు ఎంతో గర్వకారణం. బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పతకాలను అందజేయనున్నారు. ఈ పురస్కారం రావడానికి సహకరించిన ఉన్నతాధికారులకు, తోటి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.”
ఈ పురస్కారాలు పోలీస్ శాఖలో మరింత ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, ప్రజల కోసం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడతాయని సీఐ నర్సింహా రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

