కుత్బుల్లాపూర్, జూలై 9 (7 టీవీ ఫోకస్): జీడిమెట్ల డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చిరాన్ అడ్వాన్స్డ్ కేర్’ ఆస్పత్రిని బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గురువారం ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని ఆయన అన్నారు. 132వ డివిజన్ జీడిమెట్లలోని బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేసిన ‘చిరాన్ అడ్వాన్స్డ్ కేర్’ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన, ఆధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆస్పత్రిని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి వైద్య సంస్థలు ప్రజలకు సకాలంలో నాణ్యమైన చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ సునీల్, డాక్టర్ మాధురితో పాటు వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించి, ప్రజలకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుధాకర్ గౌడ్, కుంట సిద్ధిరాములు, దేవరకొండ శ్రీనివాస్, సత్తిరెడ్డి, కిషోర్ చారి, శివ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


