7tv focus : లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్-2’. సుందర్. సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘మహాశక్తి’ అనే పేరు పెట్టారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నయనతార తన భావాలను ఓ లేఖ రూపంలో పంచుకున్నారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా ఎన్నో రోజులు హృదయంలో నిలిచిపోయిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్. సీపై నయనతార ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. తన విజన్, ప్రేమ, అభిరుచిని సినిమాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సుందర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి సందర్భంలోనూ చూపిన శ్రద్ధ ఈ ప్రయాణాన్ని మరపురానిదిగా మార్చిందని చెప్పారు. ఈ సినిమా కోసం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రాన్ని నమ్మి, తమకు అండగా నిలిచిన నిర్మాత ఐసరి కె. గణేష్‌కు నయనతార ధన్యవాదాలు తెలిపారు. కథను మనస్ఫూర్తిగా నమ్మి మద్దతు ఇచ్చే నిర్మాత ఉండటం వల్ల సినిమా ప్రయాణం ఎంతో సజావుగా సాగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగమైన ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన ఖుష్బూ, స్నేహల గురించి కూడా నయనతార ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిద్దరితో కలిసి నటించిన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, ఇద్దరిపైనా తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయని తెలిపారు. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

