7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: మెట్రో రైలు ప్రాజెక్టు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కే.పీ. వివేకానంద డిమాండ్ చేశారు. మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితి చేపట్టే ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితి ప్రతినిధులతో కలిసి కొంపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కే.పీ. వివేకానంద సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా మేడ్చల్ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విభేదాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఢిల్లీలో ఒక విధంగా, రాష్ట్రంలో మరో విధంగా మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమని విమర్శించారు. ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత పనుల పురోగతి పూర్తిగా నిలిచిపోయిందని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఆ ప్రాంత అభివృద్ధికి ఆశించిన స్థాయిలో కృషి చేయలేదని కూడా ఆయన విమర్శించారు. మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితి చేపట్టనున్న ఉద్యమానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మెట్రో ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ చేపడతామని ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద తెలిపారు.

