7t focus : నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ కథానాయకుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ పేరు తెరపైకి రావడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.ఈ చిత్రంలో కాజోల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కథలో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నారని టాక్. బాలకృష్ణతో కలిసి ఆమెకు సంబంధించిన సన్నివేశాలు ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కాజోల్ నటనపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే చిత్రబృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ నటి రాషా తడానీ పేరు కూడా వినిపిస్తోంది. ఆమెను మోక్షజ్ఞ సరసన ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాషా తడానీ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె కావడంతో ఈ వార్తపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఆమె ఎంపిక కూడా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

