7tv focus : రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా రక్షణ శాఖను ఉటంకిస్తూ అక్కడి ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది.రష్యాకు చెందిన ఏఎన్-12 (An-12) సైనిక రవాణా విమానం నియమిత ప్రయాణంలో ఉండగా కెమెరోవో ప్రాంతంలోని యగునోవో గ్రామ సమీపంలో కూలిపోయింది. జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను త్వరగా అదుపులోకి తీసుకొచ్చినట్లు ప్రాంతీయ గవర్నర్ ఇల్యా సెరెద్యుక్ తెలిపారు. పోలీసులు ప్రమాద ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఇతరుల రాకపోకలను నిలిపివేశారు. దర్యాప్తు కోసం అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. హెలికాప్టర్‌తో పాటు వైద్య సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచినట్లు గవర్నర్ వెల్లడించారు.విమాన ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రష్యా విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానంలో ఏదైనా సరుకు ఉందా? అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

