7tv focus : రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు అందుతుందని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు సాధించడమే లక్ష్యంగా సీపీఐ(ఎం) సమస్త నారాయణపురం మండల పార్టీ ఆధ్వర్యంలో 28 గ్రామాలలో 79.3 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఆదివారం మర్రిగూడ మండలం చెర్లగూడెం–శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మూడు రోజులపాటు కొనసాగి మంగళవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే డిమాండ్‌తో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగారు.
సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం కావాలి
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. నారాయణపురం మండలం 63,630 ఎకరాల భౌగోళిక విస్తీర్ణంతో పాటు 44,335 మంది జనాభాను కలిగి ఉందన్నారు. మండల పరిధిలో 44,567 ఎకరాల సాగు భూమి ఉండగా, ఏడు పెద్ద చెరువులతో పాటు 69 చిన్న చెరువులు, కుంటలు ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ చెరువులు, కుంటలు భారీ వర్షాలు కురిసినప్పుడే నిండే పరిస్థితి నెలకొందని, వర్షాధారంగా వ్యవసాయం సాగుతుండడంతో రైతులు ప్రతి ఏటా సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి మండలానికి శాశ్వత సాగునీటి సౌకర్యం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు అమలుతో సాగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయని వారు పేర్కొన్నారు.

