- చెత్త సేకరణ కార్మికుల హక్కులను కాపాడాలి
- గుత్తేదారుల పెత్తనం సహించం
- ప్రైమరీ కలెక్షన్ కార్మికులకే కొనసాగించాలని డిమాండ్
7 టీవీ ఫోకస్ 29-07: కుత్బుల్లాపూర్, జూలై 29:
ఐడిపిఎల్లోని ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో కుత్బుల్లాపూర్ జోన్ స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “రామ్కీ గో బ్యాక్” కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ కార్మికుల సమస్యలు, వారి ఉపాధి భద్రత, గుత్తేదారుల జోక్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం చెత్త సేకరణ చేసే కార్మికుల పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయరాదని స్పష్టం చేశారు. పని చేసేది కార్మికులే అయినప్పుడు, వారి శ్రమ ఫలితాలు కూడా వారికే దక్కాలని పేర్కొన్నారు. కార్మికులపై ఎవరూ పెత్తనం చెలాయించకూడదని,

వారి జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు.గుత్తేదారుల పెత్తనాన్ని సహించేది లేదని హెచ్చరించిన ఆయన, సియంసీ పరిధిలోని ప్రైమరీ చెత్త సేకరణ వ్యవస్థను కార్మికులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. చెత్త సేకరణ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల కుటుంబాల జీవనాధారం దెబ్బతినకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కలమడుగు రాజేందర్ మాట్లాడుతూ, కార్మికుల పొట్టకొట్టే ఏ ప్రయత్నాన్నైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. కార్మికుల హక్కులను హరించే చర్యలను అడ్డుకుంటామని, వారి ఉపాధికి భంగం కలిగించే వారిని సహించబోమని హెచ్చరించారు. కార్మికుల జోలికి వస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, స్టీఫెన్, లక్ష్మారెడ్డి, కృష్ణ,వెంకన్న, నరసింహ, రంగన్న, మల్లేష్, అంజి, జగదీష్, ఉత్తరయ్య, ప్రశాంత్, దస్తగిరి, రవి, రామకృష్ణ, అల్వాల్ శ్రీను, కుత్బుల్లాపూర్ జోన్కు చెందిన స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికుల ఐక్యతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైందని యూనియన్ నాయకులు తెలిపారు. చెత్త సేకరణ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో కూడా పోరాటాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు

