7tv focus : ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతం ఇటీవల వరుస నిరసనలతో అట్టుడికింది. ఓట్ చోరీ, నీట్ యూజీ పరీక్ష అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), కాంగ్రెస్ పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ సందర్భంగా దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరసనలు, ప్రదర్శనలకు అనుమతించే ప్రాంతాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించారు. ప్రత్యామ్నాయ వేదికలుగా రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్లను నిర్ణయించారు.ఈ సందర్భంగా రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలు, బహిరంగ సమావేశాల నియంత్రణకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని ఢిల్లీ పోలీసులు రూపొందించారు. ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. రామ్‌లీలా మైదాన్‌లో 50 వేల మందికి మించి గుమిగూడేందుకు అనుమతి ఉండదు. అయితే, నిరసనల్లో పాల్గొనే వారి సంఖ్యను కార్యక్రమ స్వభావం, జనసమూహ పరిమాణం, అందుబాటులో ఉన్న భద్రతా ఏర్పాట్ల ఆధారంగా సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిరసనలకు అనుమతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా, కార్యక్రమ నిర్వాహకులు పోలీసుల అనుమతి కోరే ముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును సాధారణంగా ప్రతిపాదిత కార్యక్రమానికి కనీసం 10 రోజుల ముందుగా సమర్పించాలి.

