7tv focus : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఐటీ, ఫార్మా, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో సూచీలు కోలుకున్నాయి. దీంతో వరుసగా రెండు రోజులుగా కొనసాగుతున్న మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది.సెన్సెక్స్ ఉదయం 77,128.05 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. క్రితం ముగింపు 76,933.59 పాయింట్లతో పోలిస్తే ప్రారంభం నుంచే సానుకూలంగా కదిలిన సూచీ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 77,357.97 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 330.92 పాయింట్లు లాభపడి 77,264.51 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ కూడా లాభాల బాట పట్టింది. 84.80 పాయింట్లు పెరిగి 24,175.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. దీంతో కీలకమైన 24,150 స్థాయికి ఎగువన నిఫ్టీ ముగియడం మార్కెట్ వర్గాలకు ఊరటనిచ్చింది.సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.విదేశీ మారక మార్కెట్లో డాలరుతో రూపాయి మారకం విలువ 95.39గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 88.30 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,603 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

