7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 8: మానవ హక్కుల పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు ప్రముఖ న్యాయవాదులు వీఐపీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో సభ్యత్వం పొందారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వారికి సభ్యత్వ పత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ న్యాయవాదులు వీఐపీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో బుధవారం అధికారికంగా చేరారు. హైదరాబాద్లోని టోలిచౌకిలో ఉన్న అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు, న్యాయవాది ఎండి జహంగీర్, సంస్థ ప్రతినిధి మున్నా, జాతీయ కార్యదర్శి షేక్ అహ్మద్ సమక్షంలో వారికి సభ్యత్వం కల్పించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ మౌనిక సమర్ల, అడ్వకేట్ గణేష్ కల్వకోలు, అడ్వకేట్ బొమ్మల శ్రవ్య, అడ్వకేట్ భార్గవి రేగు, అడ్వకేట్ నిహారిక ఎరువ అసోసియేషన్లో చేరారు. ఈ సందర్భంగా ఎండి జహంగీర్ మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన న్యాయవాదులు సంస్థలో చేరడం ఆనందదాయకమని అన్నారు. వీరి సహకారంతో వెనుకబడిన, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు మానవ హక్కుల పరిరక్షణలో సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ కార్యదర్శి షేక్ అహ్మద్ మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుంచి న్యాయ నిపుణులు అసోసియేషన్లో చేరడం సంస్థపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం తమ న్యాయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సంస్థ ఆశయాల సాధనకు కృషి చేస్తామని నూతనంగా చేరిన న్యాయవాదులు ఈ సందర్భంగా తెలిపారు.

