బలిదాన్ దివస్ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఘన నివాళులు
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 23: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తదితరులు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం దేశభక్తి, త్యాగం, ధైర్యసాహసాలకు ప్రతీక అని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో పూర్తిస్థాయిలో విలీనం చేయాలనే లక్ష్యంతో ఆయన చేసిన పోరాటం చారిత్రాత్మకమని అన్నారు. హైదరాబాద్ సంస్థాన విలీనంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ పోషించిన పాత్ర మాదిరిగానే, కాశ్మీర్ విషయంలో ముఖర్జీ చేసిన త్యాగం దేశ సమైక్యతకు దోహదపడిందని వివరించారు. పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా కొనసాగడంలో కూడా ముఖర్జీ కీలక పాత్ర పోషించారని రాంచందర్ రావు తెలిపారు. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమైన విధానాలను వ్యతిరేకిస్తూ ఆయన నెహ్రూ మంత్రివర్గానికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తిని బీజేపీ కార్యకర్తలు ఆయన జీవితం నుంచి స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బెంగాల్లో బీజేపీ సాధిస్తున్న విజయాలు తెలంగాణ కార్యకర్తలకు ఆదర్శంగా నిలవాలని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

