బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
7టీవీ ఫోకస్, పటాన్ చేరు, జూన్ 30: పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచీ పరిశ్రమలో గత ఏడాది జరిగిన ఘోర ప్రమాదానికి ఏడాది పూర్తైన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బాధిత కార్మికులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని, ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.గత ఏడాది పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించడమే కాకుండా, పారిశ్రామిక భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ప్రమాదానికి గల కారణాలు, పరిశ్రమల్లో భద్రతా నిబంధనల అమలు, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం, పునరావాసం వంటి అంశాలు అప్పట్లో ప్రధాన చర్చగా మారాయి.ఈ దుర్ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా పాశమైలారం బీపీఎల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి దుర్ఘటనలో మృతిచెందిన కార్మికులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. అలాగే, సిగాచీ బాధితులతో కలిసి నిర్వహించదలిచిన సంస్మరణ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం, కుటుంబ సభ్యులకు ఉపాధి, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

