ఇంటింటికీ చేరని ఎన్యుమరేషన్ ఫారాలు.. 15–20 శాతం మందికే పంపిణీ జరిగిందని బీజేపీ ఆరోపణ
బీఎల్వోలపై పర్యవేక్షణ పెంచాలని, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బిక్షపతి యాదవ్ డిమాండ్
కుత్బుల్లాపూర్, జూలై 7 (7టీవీ ఫోకస్): ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం బాచుపల్లి మండల పరిధిలో ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని, దీంతో వేలాది మంది ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని భారతీయ జనతా పార్టీ నిజాంపేట, బండారి లేఔట్ అధ్యక్షుడు బిక్షపతి యాదవ్ ఆరోపించారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో అనేక లోపాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24వ తేదీ వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, తిరిగి సేకరించాల్సి ఉన్నప్పటికీ, బాచుపల్లి మండలంలో ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని పేర్కొన్నారు. ఓటరు జాబితాల్లో చిరునామాలు సరిగా లేకపోవడం, అపార్ట్మెంట్లు అధికంగా ఉండటం, కొంతమంది బీఎల్వోలు విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, ఇతరులతో పనులు చేయించడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వంటి కారణాలతో ఇప్పటివరకు కేవలం 15 నుంచి 20 శాతం మంది ఓటర్లకే ఫారాలు అందినట్లు సమాచారం ఉందని తెలిపారు. ఓటరు వివరాల మార్పులు, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు వంటి అంశాలపై బీఎల్వోలకు తగిన అవగాహన లేకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. దీంతో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రధాన కూడళ్లలో అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ప్రచార వాహనాల ద్వారా ప్రతి కాలనీలో ప్రజలకు సమాచారం అందించాలని కోరారు. ఇంటింటికీ ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అందజేస్తున్న సిబ్బంది మాదిరిగానే ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కూడా సమర్థంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీల బీఎల్ఏ-2లు, స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో ప్రతి అర్హత కలిగిన ఓటరికి ఫారాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వల్ల అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోతే సంబంధిత బీఎల్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి అత్యంత విలువైన హక్కు అని, అర్హులైన ఒక్క ఓటరు కూడా తమ హక్కును కోల్పోకూడదని, అదే సమయంలో అనర్హుల పేర్లు ఓటరు జాబితాలో ఉండకూడదని బిక్షపతి యాదవ్ పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశాన్ని భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని, ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏ-2లు అన్ని విధాలా సహకరిస్తారని తెలిపారు.

