ట్రాఫిక్ రద్దీ నివారణకు ఐటీ సంస్థలకు కీలక సూచనలు
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఎస్సీఎస్సీ, ఐటీ కంపెనీలతో సమన్వయ సమావేశం
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 19: వర్షాకాలంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన అందించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ), వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్, సీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ఆకస్మిక భారీ వర్షాలు, నీటిమునిగే ప్రాంతాలు, ట్రాఫిక్ అంతరాయాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సైబరాబాద్ కన్వర్జెన్స్ సెంటర్ (సీసీసీ) ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే నీరు నిలిచే ప్రాంతాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రహదారులపై నిలిచిపోయే వాహనాలు, చెట్లు లేదా ఇతర అవరోధాలను వెంటనే తొలగించేందుకు టోయింగ్ క్రేన్లు, వాటర్ పంపులు, ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు వర్షాల సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఐటీ సంస్థలకు పలు సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న సమయంలో ఉద్యోగులను విడతల వారీగా కార్యాలయాల నుంచి పంపించాలని, క్లౌడ్‌బర్స్ట్ వంటి పరిస్థితుల్లో వర్షం తగ్గే వరకు కార్యాలయ ప్రాంగణాల్లోనే సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల వినియోగాన్ని పెంచాలని కోరారు. ఐటీ కారిడార్‌కు రోజూ సుమారు 1.2 లక్షల సింగిల్ ఆక్యుపెన్సీ వాహనాలు వస్తున్నందున ప్రత్యామ్నాయ రవాణా విధానాలను ప్రోత్సహించడం అవసరమని అభిప్రాయపడ్డారు.
అలాగే వర్షపు నీరు నిల్వ కాకుండా ఉండేందుకు ఐటీ పార్కులు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయ భవనాలు తమ రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, డ్రైనేజీ వ్యవస్థలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు వాతావరణ హెచ్చరికలు, అత్యవసర సమాచారాన్ని నేరుగా అందించేందుకు ‘సైబరాబాద్ వెదర్ యాప్’ ను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలు ట్రాఫిక్ పల్స్ యాప్ తో పాటు సైబరాబాద్ ట్రాఫిక్ సోషల్ మీడియా వేదికలను అనుసరించాలని సూచించారు. వర్షాకాలంలో ట్రాఫిక్ నిర్వహణ, ప్రయాణికుల భద్రత కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వాలంటీర్లు 24 గంటల పాటు అప్రమత్తంగా పనిచేస్తారని అధికారులు స్పష్టం చేశారు.

