7tv focus : కేరళంలో ఓనం పండుగ వేడుకలు సాంకేతికతతో కలిసిపోయాయి. ఓనం అంటే పూల ముగ్గులు, పాయసం, సద్య, మావేలి.. ఇదే కదా మనకు తెలిసిన సందడి! కానీ ఈసారి కొచ్చిలో మాత్రం ఓనం వేడుకలకు సరికొత్త అతిథులు వచ్చేశారు. వాళ్లే.. రోబోలు! పాటలకు డ్యాన్సులు చేస్తూ.. సంప్రదాయ వేషాలధారణలో అందరిని పలకరిస్తూ ఫోరమ్ కొచ్చిలో సందడి చేశారు. కొచ్చిలోని మరడులో ఉన్న ఫోరమ్ కొచ్చిలో ఈ వినూత్న కార్యక్రమం జరిగింది. ఇప్పుడు రోబోలు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పాటలకు రోబోల అదిరిపోయే స్టెప్పులు..
ఓనం పండుగ సందర్భంగా ఏర్పాటు ఈ కార్యక్రమంలో రోబోలు రాజుల వేషధారణలో ట్రెండిగ్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ముఖ్యంగా కొన్ని రోబోలు కేరళం ప్రజల అభిమాన పౌరాణిక రాజు మహాబలి, అంటే మావేలి వేషధారణలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓనం పండుగతో మావేలి పాత్రకు ప్రత్యేక అనుబంధం ఉంది. కేరళం ప్రజలు శ్రేయస్సు, ఐక్యత, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా భావించే మహాబలి రాజు ఓనం సందర్భంగా తమను సందర్శిస్తాడనే నమ్మకం ఉంది. ఈ సంప్రదాయ పాత్రకు రోబోటిక్ రూపం ఇవ్వడం సందర్శకులను ఆశ్చర్యపరిచింది.ఈ రోబోటిక్ ప్రదర్శన కోసం రోబోలను కార్యక్రమాలు, హోటళ్లు, జాతరలు, ప్రచార కార్యక్రమాలు, ఇతర బహిరంగ వేడుకలకు అందించే ‘రోబోరెంట్’ సంస్థ సమకూర్చింది. కార్యక్రమాల్లో రోబోల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని సంస్థ యజమాని రషీద్ ఎన్కే తెలిపారు. అయితే రోబోలతో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు సందర్శకులు ఆసక్తి చూపించారు. కొందరు రోబోలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే, మరికొందరు వాటి డ్యాన్స్‌ను తమ మొబైళ్లలో బంధించారు.

