7tv focus : కూటమి ప్రభుత్వం ప్రారంభంలో రేషన్ దుకాణాల్లో బియ్యం, చక్కెర, జొన్నలతో పాటు కంది పప్పును సైతం అందించింది. ఒక్కో కార్డుదారుడికి కిలో కందిపప్పు రూ.67తో పంపిణీ చేసింది. ఒకటి,రెండు నెలలు మాత్రమే కందిపప్పు పంపిణీ సాగింది. తర్వాత రేషన్దుకాణాల్లో కందిపప్పు కనబడకుండా పోయింది. కందిపప్పు సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు నిరాశ చెందుతున్నారు.
పెరిగిన కందిపప్పు ధర
ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. గతంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రాయితీపై రూ.67కు అందజేసింది. ఈ ధర కంటే కందిపప్పు ధర రెట్టింపు ఉండటంతో పేదలు కొనలేకపోతున్నారు. మార్కెట్లో చక్కెర ధర రూ.70 వరకు ఉంది. జిల్లాలో కొన్ని స్టోర్లలో చక్కెర స్టాకు తక్కువగా వచ్చిందని చెప్పి అరకొరగా సరఫరా చేసి మిగిలింది మార్కెట్ విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. స్టోర్లలో చక్కెర కిలో రూ.20కి విక్రయిస్తున్నారు.
కందిపప్పు సరఫరా చేయాలి
రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, చక్కెరతో పాటు కందిపప్పు తక్కువ ధరకు అందించాలి. ప్రస్తుతం బయట మార్కెట్లో కందిపప్పు, చక్కెర ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కుటుంబ పోషణ భారమయింది. ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. ప్రతినెలా రేషన్ దుకాణాల్లో కందిపప్పు కూడా పంపిణీ చేయాలి.
- లింగమ్మ, ధర్మవరం
రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం
కందిపప్పు కోసం రెండేళ్లగా ఎదురుచూస్తున్నాం. గత ప్రభుత్వంలో కందిపప్పు ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో రెండుసార్లు మాత్రమే రేషన్దుకాణాల్లో ఇచ్చారు. మళ్లీ ఇంతవరకు ఇవ్వలేదు. రేషన్ దుకాణాల్లో రూ.67లకే కందిపప్పు దొరుకుతుంది. బయట షాపుల్లో కొనాలంటే రూ.120 పెట్టాల్సి వస్తోంది.

