7tv డెస్క్: మహారాష్ట్ర ఠాణే జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. కుక్క కరిచిందని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లిన ఓ మూడేళ్ల బాలుడికి ఇంజెక్షన్ ఇస్తుండగా.. సూది విరిగి శరీరంలోనే ఉండిపోయింది. అలాగే ఆ బాలుణ్ని ఇంటికి పంపించగా.. తీవ్ర నొప్పితో బాధపడుతుండటంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇదీ జరిగింది..
కవేశ్ అనే బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఓ పెంపుడు కుక్క కరిచింది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలుణ్ని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అతడికి రేబీస్ నిరోధక టీకాలు ఇవ్వసాగారు. చేతులకు, తొడ భాగంలో 3 ఇంజెక్షన్లు ఇచ్చాక.. మరో ఇంజెక్షన్‌ను తుంటి భాగంలో ఇస్తుండగా సూది విరిగి శరీరంలోనే ఇరుక్కుపోయిందని బాలుడి తల్లి తెలిపారు. ఆ సమయంలో చిన్నారి కదలడం వల్లే అది విరిగిందని వైద్యురాలు చెప్పినట్టు ఆమె చెప్పారు.

