7tv focus : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు వద్ద వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమంగా బయటపడ్డారు. మరో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు గల్లంతైన ఓ మత్స్యకారుడి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.బుధవారం ఉదయం చేపల వేట కోసం వలలు కట్టేందుకు ఐదుగురు మత్స్యకారులు బేతుపల్లి చెరువు అలుగు వద్దకు వెళ్లారు. మురసు తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులోకి భారీగా వరద చేరడంతో వారంతా చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని ఆరో బెటాలియన్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సహాయక చర్యలకు పంపించారు. రెండు లైఫ్ బోట్లలో మొత్తం 11 మంది సిబ్బంది వరదలోకి వెళ్లారు. వారు ఐదుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.అయితే, తిరిగి ఒడ్డుకు చేరుకునే సమయంలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రెండు బోట్లు అదుపుతప్పి బోల్తాపడ్డాయి. దీంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ్మిలేరు వాగు వైపు కొట్టుకుపోయారు. తొలుత 11 మంది గల్లంతైనట్లు సమాచారం అందగా.. తాజాగా వారిలో 10 మంది క్షేమంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, రామనగరం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడి కోసం గాలిస్తున్నారు.

