7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 17: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితులకు న్యాయస్థానం శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు కూర కిరణ్ సాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించగా, రెండో నిందితురాలు చిలకముక్కు దీపికకు మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం, 2019 జూన్ 27న ఓ తండ్రి తన మూడున్నరేళ్ల కుమార్తెపై పాఠశాలలో లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేశాడు. చిన్నారి పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తూ, కడుపు మరియు ప్రైవేట్ భాగాల్లో నొప్పి ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. ఈ సందర్భంగా పాఠశాలలో కరాటే, జిమ్నాస్టిక్స్ శిక్షకుడిగా పనిచేస్తున్న కిరణ్ తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడని చిన్నారి తెలిపింది. దర్యాప్తులో భాగంగా, పాఠశాల వాహనం ఆలస్యంగా వచ్చిన సమయంలో చిన్నారిని పై అంతస్తులోని జిమ్నాస్టిక్స్ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటనకు అవకాశం లభించినట్లు దర్యాప్తులో తేలింది. కేసును దర్యాప్తు చేసిన అధికారులు 2019 జూలై 2న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం రాజేంద్రనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీ టి. శ్రీనివాస్ నిందితులను దోషులుగా తేల్చి శిక్ష విధించారు. అలాగే బాధిత చిన్నారికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ వివరాలను సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ఎ. ముత్యం రెడ్డి వెల్లడించారు.

