7tv focus : మాజీ ఐఏఎస్ ఆఫీసర్ దివ్యా మిట్టల్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. జన నీతి భారత్ అని పేరు పెట్టారు. ఐఏఎస్ గా ఆమె స్వచ్ఛంధ పదవీవిరమణ తీసుకున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు దివ్యా మిట్టల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. విధాన రూపకల్పనలో ప్రజలను కేంద్రబిందువుగా మార్చనున్నట్లు ఆమె తెలిపారు. అయిదేళ్ల సమయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చేయనున్నట్లు చెప్పారు. జన నీతి పార్టీలో మీరే పాలిస్తారని ఆమె అన్నారు.ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగుళూరు, వాల్ స్ట్రీట్ ట్రేడర్ అయిన దివ్యా మిట్టల్.. సుమారు 13 ఏళ్ల పాటు ఐఏఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆగస్టు 30వ తేదీన ఆమె తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె సెప్టెంబర్ 29వ తేదీన ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటు గురించి ఆమె చెబుతూ.. దేశంలో రాజకీయ పార్టీల కొరత ఏమీ లేదని, కానీ ప్రజా సమస్యలను ఆలకించే పార్టీలు లేవని, కొన్ని పార్టీలు కొందర్ని మాత్రమే వింటున్నాయని ఆమె అన్నారు. జన నీతి భారత్ ప్రతినిధులు మాత్రం ప్రజలకు జవాబుదారులుగా ఉంటారన్నారు.

