పశ్చిమ బెంగాల్ 7tv focus : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ డా.ఆశిష్ బెనర్జీ (74) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది కూడా టీఎంసీ పార్టీ ఆఫీసులోనే. ఆత్మహత్య చేసుకున్న చోటు నుంచి పోలీసులు ఒక సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. ఆశిష్ బెనర్జీ ఆదివారం ఉదయం రాంపూర్హత్ పట్టణంలోని తన ఇంటికి సమీపంలోనే ఉన్న టీఎంసీ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఆధారాల్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఒక సూసైడ్ నోట్ లభించింది.ఈ లేఖలో తాను అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నాడు. రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన తప్పు అని వివరించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కూడా లేఖలో రాశారు. ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. టెండర్లలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తారాపీఠ్-రాంపూర్హత్ డెవలప్మెంట్ అథారిటీ (టీఆర్డీయే)కు సంబంధించి ఇటీవల పలు అక్రమాలు వెలుగు చూశాయి. టెండర్లు, చెక్కులు, ఎన్వోసీలు సహా పలు అంశాల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. వీటికి ఆశిష్ బెనర్జీని బాధ్యుడిని చేస్తూ విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై తన సూసైడ్ లేఖలో ఆశిష్ బెనర్జీ పేర్కొన్నారు. తాను ఏ పనులకూ డబ్బు డిమాండ్ చేయలేదని, టీఆర్డీయేకు సంబంధించిన అవినీతికి, తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు.

