ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు సిబ్బందికి సీపీ రమేష్ దిశానిర్దేశం
ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
150 మంది శిక్షణ పొందిన సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 23: ట్రాఫిక్ నియంత్రణలో క్రమశిక్షణ, సమర్థతతో పాటు ప్రజా సేవా దృక్పథం అత్యంత ముఖ్యమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., పేర్కొన్నారు. ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 150 మంది గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బందితో మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఆయన సమావేశమయ్యారు. వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న సిబ్బందిని అభినందించిన సీపీ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కేవలం వాహనాల రాకపోకలను పర్యవేక్షించడం మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతతో కూడిన సేవ అని అన్నారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా, సహనంతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. రద్దీ ప్రాంతాల్లో పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కొంటూ ట్రాఫిక్ సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందిస్తూ ప్రజలకు సహాయం అందించాలని ఆదేశించారు. శిక్షణలో భాగంగా ట్రాఫిక్ నిర్వహణ, ట్రాఫిక్ ఇంజనీరింగ్, రోడ్డు భద్రత, చట్టపరమైన అంశాలు, ట్రాఫిక్ నియంత్రణ పద్ధతులపై ఇండోర్, అవుట్డోర్ తరగతుల ద్వారా సమగ్ర అవగాహన కల్పించినట్లు సీపీ తెలిపారు. నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిర్వహణలో ఆధునిక విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం, సీటుబెల్ట్ వినియోగించకపోవడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, లేన్ క్రమశిక్షణ పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని, ప్రతి పోలీసు సిబ్బంది ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల చైతన్యం తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా, ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. అయితే చట్ట అమలుతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా నిబంధనల పట్ల స్వచ్ఛంద క్రమశిక్షణ పెంపొందేలా చూడాలని సూచించారు. ప్రత్యేకంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో రోజురోజుకూ ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోందని, అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రద్దీ కూడళ్ల వద్ద సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లపై నీటి నిల్వలు, వాహనాల నిలిచిపోవడం, ప్రమాదాల అవకాశాలు వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సీపీ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకుంటూ సేవాభావంతో పనిచేయాలని అన్నారు. పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరిగేలా ప్రతి సిబ్బంది తమ ప్రవర్తన, పనితీరులో నిబద్ధత కనబరచాలని సీపీ రమేష్ సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ బాధ్యతాయుతమైన విధి నిర్వహణ ద్వారా శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, ఎస్బీ డీసీపీ సుధీంద్ర, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్, సీఏఆర్ అండ్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, ట్రాఫిక్ అడ్మిన్ ఏడీసీపీ నరేందర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

